నల్లకుబేరులు, అవినీతిపరులు, అక్రమార్కులకు బ్యాడ్ న్యూస్. వారి వెన్నులో వణుకు పుట్టించే వార్త ఇది. ఆదాయ పన్ను(ఐటీ) చట్ట సవరణ బిల్లు(ది టాక్సేషన్ లా.. సెకండ్ అమెండ్ మెంట్-2016)కు లోక్ సభలో ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం తర్వాత ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటు ద్వారా బిల్లు ఆమోదం పొందినట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలను తిరస్కరించిన స్పీకర్.. ప్రస్తుత సమయంలో బిల్లుపై సమగ్ర చర్చ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. బిల్లు ఆమోదం పొందే సమయంలో విపక్ష నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిల్లుపై ఓటింగ్ కోసం డిమాండ్ చేశారు. వారి ఆందోళనల మధ్యే బిల్లు ఆమోదం పొందింది. ఇక ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందాల్సి ఉంది.
కొత్త ఐటీ చట్టం వివరాల్లోకి వస్తే... ఈ పథకానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై) 2016 అని పేరు పెట్టారు. ఈ పథకం ప్రకారం 2017 ఏప్రిల్ 1వ తేదీలోగా తమ బ్యాంక్ అకౌంట్లలోకి లెక్కల్లో చూపని డబ్బును జమ చేసేవారికి మొత్తం డిపాజిట్ మీద 30 శాతం ట్యాక్స్, 10 శాతం పెనాల్టీ విధిస్తారు. దీనికి తోడు మరో 10 శాతాన్ని గరీబ్ కళ్యాణ్ సెస్ కింద వసూలు చేస్తారు. అంటే, మొత్తం డబ్బులో 50 శాతం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. మిగిలిన 50 శాతం మొత్తంలో సగం (అసలులో 25శాతం) వెంటనే తీసుకోవచ్చు. మిగిలిన సగాన్ని మాత్రం నాలుగేళ్ల పాటు లాక్ చేస్తారు. ఈ మొత్తానికి వడ్డీ కూడా చెల్లించరు. మరో విషయం ఏమిటంటే... ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తాన్ని ఏ ఏడాది కూడా ఆదాయపన్ను డిక్లరేషన్ లో చూపించరాదు.
ఇక డబ్బును స్వచ్ఛందంగా బ్యాంకుల్లో జమ చేయకపోతే, కష్టాలను కొని తెచ్చుకున్నట్టే. అధికారుల దాడుల్లో నల్లధనం దొరికితే 60 శాతం పన్ను విధించడమే కాకుండా... అదనంగా 15 శాతం సర్ ఛార్జిని, 10 శాతం పెనాల్టీని విధిస్తారు. అంటే 85 శాతం కట్టాల్సి ఉంటుందన్న మాట. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది.
No comments:
Post a Comment