పెద్దగద్దెలనేలి పేరుకెక్కినవాడు ఎవడయ్య
ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు.
పంచకట్టుటలో ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడపదాటని వాడు
పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య
ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు.
నేల నల్దెసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టె ఒదిగిన వాడు
"ఏ దేశమేగినా ఎందుకాలిడినా"
ఆవకాయ వియోగ మసలెసైపని వాడు ఎవడయ్య
ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు
మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు
భాయి భాయి అన్న చేయి కలిపేవాడు
తిక్కరేగిందంటె డొక్క చీల్చేవాడు
చిక్కులెరుగని వాడు చిత్తాన పసివాడు ఎవడయ్య
ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు.
----డాక్టర్ సి. నారాయణరెడ్డి
No comments:
Post a Comment