-::సింహాచల స్థిత శ్రీ వరాహ లక్ష్మీనృసింహ పరబ్రహ్మణే నమః ::-
-:: శ్రీ బాలా త్రిపురసుందరీ సహిత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామినే నమః ::-
-:: శ్రీ బాలా త్రిపురసుందరీ సహిత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామినే నమః ::-
ఇందులో మొదటిది అందరికీ సుపరిచితమే. కానీ రెండవది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీనిని ఈ ముఖపుస్తకము ద్వారా వీలున్నంతగ తెలియజేయాలని నా ప్రయత్నం.
సింహాచల క్షేత్రపాలకుడు "శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారు". అమ్మవారి పేరు "శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి". సింహాచలం కొండపైన రథశాల దగ్గర మనం వరాహనృసింహస్వామి దర్శనానికి కుడి వైపు తిరిగేటపుడు (అకాశ గంగ ధార మార్గమునకు ప్రక్కగా) ఎడమచేతి వైపు ఈ దేవాలయం దర్శనమిస్తుంది. అక్కడ పురాతన అశ్వత్థవృక్షం కూడా ఉంటుంది. ఈ క్షేత్రపాలకుని దర్శించనిదే సింహాచలయాత్ర పూర్ణము కాదు. మేము 1995 సంవత్సరంలో స్వామి దర్శనానికి ఒక తెలిసిన వైష్ణవ ఆచార్యుని ద్వారా వెళ్ళాం. ముందుగా క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్నాము. దానికి ఆ వైష్ణవాచార్యుల వారికి చాలా కోపం వచ్చింది. అక్కడ నరసింహస్వామినే దర్శించాలి కానీ శివుని దర్శించకూడదు అని చెప్పారు. ఆశ్చర్యమనిపించింది. కానీ ఇప్పటికి దశాబ్దం గడిచినా అక్కడ అలవాట్లు, మతపు పట్టింపులు అలాగే ఉన్నాయి. అక్కడ అన్నిటికీ మార్గాన్ని నిర్దేశిస్తూ బోర్డులు ఉంటాయి. చివరికి చెప్పుల స్టాండుకి కూడా...కానీ ఈ దేవాలయానికి ఎటువంటి మార్గ నిర్దేశం లేదు. ఆదరణలేక మేము వెళ్ళినపుడు చాలా సార్లు ఆ దేవాలయం మూసి ఉండేది. నరసింహస్వామి దేవాలయం ఎంత ప్రాచీనమో ఇది కూడా అంతే ప్రాచీనం. దానికి దక్షిణద్వారం వద్ద దక్షిణామూర్తివారి అద్భుతమైన శిల్పం కూడా ఉండి. శివునకు ఇరుప్రక్కలా గజానన షడాణనులు కొలువై ఉంటారు. ప్రక్కగా శ్రీ బాలా త్రిపురసుందరీ దేవీ అమ్మవారు దర్శనమిస్తారు.
రాబోయే ఆషాఢ పూర్ణిమ నాడు వేలల్లో గిరి ప్రదక్షిణ చేసి వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకుంటారు. అదే సమయంలో క్షేత్రపాలుకుడైన శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వారి దర్శనం మరువవద్దు. మీరు ఎప్పుడు ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళినా క్షేత్రపాలకుని దర్శించండి. మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా ఈ విషయం తెలియజేసి సంపూర్ణంగా దైవదర్శన ఫలితాన్ని పొందేటట్లు చేయండి.
(క్రొత్తగా అక్కడ కాశివిశ్వేశ్వర ఆలయం ఒకటి నిర్మించారు. ప్రక్కనే విశాఖ గ్రామదేవత అయిన శ్రీ కనకమహాలక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టారు. వీటన్నిటికన్నా ప్రధానమైనది క్షేత్రపాలకుని దర్శనం).
No comments:
Post a Comment