నిజాం రాజు తలవంచిన రోజు..!
దేశాన్ని రెండు ముక్కలు చేసిన బ్రిటిష్ పాలకులు వెళ్తూ వెళ్తూ అప్పటికే దేశంలో ఉన్న 565 సంస్థానాలకు మాత్రం స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టి వెళ్లారు. 562 సంస్థానాలు బేషరతుగా భారత్ యూనియన్‌లో అంతర్భాగమవగా కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మూడూ స్వతంత్ర రాజ్యాలుగా ఉండడానికి తీవ్ర ప్రయత్నాలు సాగించాయి. ప్రత్యేకించి దేశం నడిబొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థానాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయడానికి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రయత్నించాడు. అప్పటికే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరొందాడు నిజాం. సొంత కరెన్సీ (హైదరాబాదీ రూపాయి), సొంత రైల్వే, సొంత సైన్యం ఉండడంతో స్వతంత్ర రాజ్యంగా ఉండాలనేది అతడి తపన. భారత్‌లో విలీనం అంశంపై మాత్రం మరో ఏడాది గడువు కావాలని అడిగాడు. అప్పటిదాకా యథాతథ స్థితి కావాలని కోరాడు. కాని అతడి వైఖరిపై, ఆలోచనలపై అనుమానంతో ఉన్న సర్దార్ పటేల్ అందుకు ఒప్పుకోలేదు. భౌగోళికంగా భారత్ నడిమధ్యలో ఉన్న హైదరాబాద్‌కు తీర ప్రాంత సదుపాయం లేదు. అయినా సరే ప్రత్యేక రాజ్యంగా మనుగడ సాగించాలనేది అతడి బలమైన కోరిక.ఇటు చర్చలు.. అటు పాక్‌తో వ్యూహాలు
ఇటు భారత్‌తో చర్చలకు గడువు కోరుతూనే మరోవైపు పాకిస్థాన్‌కు రూ. 20 కోట్ల సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌లో పోరాటానికి మద్దతుగానే పాక్‌కు ఈ సొమ్ము ఇచ్చాడనేది బహిరంగ రహస్యం. పటేల్‌కు నిజాం వైఖరిపై అనుమానం రావడానికి ఇదో కారణం. దీనిమీద రహస్యంగా కూపీ లాగగా పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టును వాడుకునేలా పాకిస్థాన్ అధ్యక్షుడు జిన్నాతో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకార్లు మతకల్లోలాను సృష్టించి జనాన్ని భీతావహుల్ని చేశారు. నిజాంకు నమ్మిన బంటు అయిన ఖాసిం రజ్వీ ఎలాగైనా హైదరాబాద్‌ను ‘ఉస్మానాబాద్’గా మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకనుగుణంగా నిజాంను కూడా ఒప్పించాడు. స్వాతంత్య్రానికి పూర్వం జిన్నా కాంగ్రెస్ నేతల్ని భయపెట్టడం కోసం ‘డైరెక్ట్ యాక్షన్ డే’ చేపట్టనున్నట్లు ప్రకటించినట్లుగానే రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ 2 లక్షలమంది రజాకార్లతో భారీ కవాతు నిర్వహించి ఉస్మానాబాద్ ఏర్పాటుకు ఒప్పుకోవాలంటూ భారత ప్రభుత్వానికి ఓ హెచ్చరిక పంపించాడు. హైదరాబాద్ సంస్థానానికి సరిహద్దు ప్రాంతాలకు కూడా వీరి ఆగడాలు పాకినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక ఉపేక్షించడం మంచిది కాదని నాటి ఉప ప్రధాని, హోంమంత్రి వల్లభాయ్ పటేల్ భావించారు. రజాకార్ల బీభత్సకాండకు అడ్డుకట్ట వేసి హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఆయన నిర్ణయించారు. ఫలితంగా భారత సైన్యం పోలీసు చర్య చేపట్టింది.
* హైదరాబాద్‌పై పోలీసు చర్య పేరు ‘ఆపరేషన్ పోలో’. ఇది 108 గంటలు సాగింది.
* 1948 సెప్టెంబరు 13న మేజర్ జనరల్ చౌదరి నాయకత్వంలో మొదలైన ఆపరేషన్ సెప్టెంబరు 18 సాయంత్రం పూర్తయింది.
* నిజానికి సెప్టెంబరు 17నే నిజాం సైన్యం భారత్ సైన్యానికి లొంగిపోయింది. అనేక నాటకీయ పరిణామాల తర్వాత నిజాం లొంగిపోతున్నట్లు ప్రకటించాడు.
* 18న హైదరాబాద్‌లోకి ప్రవేశించిన భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు.
* ఎట్టకేలకు హైదరాబాద్ సంస్థానం భారత్‌లో అంతర్భాగమైంది. సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పమే దీనికి ప్రధాన కారణం. ఆయన చొరవ లేకుంటే దేశం గుండెల మీద ఇదో నిప్పుల కుంపటిలా నిలిచి ఉండేది.





No comments:
Post a Comment