2-226-వ.
జలమధ్యంబుననుండి యక్షర సమామ్నాయంబున స్పర్శంబు లందు షోడశాక్షరంబును మఱియు నేకవింశాక్షరంబును నైన యియ్యక్షర ద్వయంబు వలన నగుచు మహామునిజనధనం బయిన "తప" యను శబ్దం బినుమాఱుచ్చరింపంబడి వినంబడిన నట్టి శబ్దంబు వలికిన యప్పురుషుని వీక్షింప గోరి నలుదిక్కులకుం జని వెదకి యెందునుం గానక మరలివచ్చి నిజస్థానంబైన పద్మంబునం దాసీనుండై యొక్కింత చింతించి; యట్టి శబ్దంబు దన్నుఁ దపంబు సేయుమని నియమించుటగాఁ దలంచి ప్రాణాయామ పరాయణుండై జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి యేకాగ్రచిత్తుండై, సకలలోక సంతాపహేతువగు తపంబు వేయి దివ్యవత్సరంబులు గావింప, నీశ్వరుండు ప్రసన్నుండై పొడసూపిన నక్కమలసంభవుండు తత్క్షణంబ రాజసతామసమిశ్రసత్త్వ గుణాతీతంబును, శుద్ధ సత్త్వగుణావాసంబును, నకాలవిక్రమంబును, సర్వలోకోన్నతంబును, సకల సురగణ స్తుత్యంబును, లోభ మోహభయ విరహితంబును, నపునరావృత్తి మార్గంబును, ననంత తేజోవిరాజితంబు నైన వైకుంఠపురంబుం బొడగని; యందు.
టీకా:
జల = నీటి; మధ్యంబునన్ = మధ్యలో; నుండి = నుండి; అక్షర = అక్షరముల; సమ = మొత్తము; ఆమ్నాయంబునన్ = అక్షరమాలలో; స్పర్శంబులు = హల్లులు; అందున్ = లో; షోడశ = పదహారవ (16) (త); అక్షరంబునున్ = అక్షరము; మఱియున్ = మరియు; ఏకవింశ = ఇరవై ఒకటవ (21) (ప); అక్షరంబునున్ = అక్షరము; ఐన = అయిన; ఈ = ఈ; అక్షర = అక్షర; ద్వయంబున్ = ద్వయము; వలనన్ = వలన; అగుచున్ = అగుచు; మహా = గొప్ప; ముని = మునుల; జన = సమూహములకు; ధనంబున్ = సంపద; అయిన = అయిన; తప = తప; అను = అను; శబ్దంబున్ = శబ్దము; ఇను = రెండు; మాఱు = మార్లు; ఉచ్చరింపంబడి = పలుకబడి; వినంబడిన = వినబడిన; అట్టి = అటువంటి; శబ్దంబున్ = శబ్దమును; పలికిన = పలికిన; ఆ = ఆ; పురుషునిన్ = మహాత్ముని; వీక్షింపన్ = చూడవలెనను; కోరి = కోరికతో; నలు = నాలుగు; దిక్కులన్ = దిక్కుల; కున్ = కు; చని = వెళ్ళి; వెదకి = వెతికి; ఎందునున్ = ఎక్కడను; కానకన్ = కనబడక పోవుటచే; మరలి = వెనుకకు; వచ్చి = వచ్చి; నిజ = తన యొక్క; స్థానంబున్ = నివాసస్థానము; ఐన = అయిన; పద్మంబునన్ = పద్మములో; ఆసీనుండు = కూర్చున్న వాడు; ఐ = అయ్యి; ఒక్కింత = కొంచము; చింతించి = బాధపడి; అట్టి = అటువంటి; శబ్దంబున్ = శబ్దము; తన్నుఁన్ = తనను; తపంబున్ = తపస్సు; చేయుము = చేయుము; అని = అని; నియమించుటగాన్ = ఆఙ్ఞాపించుటగా; తలంచి = అనుకొని; ప్రాణాయామ = ప్రాణాయాము నందు; పరాయణుండు = నిష్టలో ఉన్నవాడు; ఐ = అయ్యి; జ్ఞానేంద్రియ = జ్ఞానేంద్రియములను; కర్మేంద్రియములన్ = కర్మేంద్రియములను; జయించి = జయించి; ఏకాగ్ర = ఏకాగ్ర మైన {ఏకాగ్ర - ఒకే తావున నిలిపిన}; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; సకల = సమస్త; లోక = లోకములు; సంతాప = తపించుటకు; హేతువు = కారణము; అగున్ = అగు; తపంబున్ = తపస్సును; వేయి = వెయ్యి (1000); దివ్య = దేవతల; వత్సరంబులున్ = సంవత్సరములు; కావింపన్ = చేయగా; ఈశ్వరుండున్ = విష్ణువు {ఈశ్వరుడు - ప్రభుత్వము కలవాడు}; ప్రసన్నుండు = ప్రసన్నుడు; ఐ = అయ్యి; పొడసూపినన్ = ప్రత్యక్షము కాగా; ఆ = ఆ; కమలసంభవుండు = బ్రహ్మదేవుడు {కమలసంభవుడు - పద్మము నందు పుట్టిన వాడు, బ్రహ్మ}; తత్క్షణంబ = వెంటనే; రాజస = రజోగుణ; తామస = తమోగుణములతో; మిశ్ర = కలసిన; సత్వ = సత్త్వ; గుణ = గుణములకు; అతీతంబున్ = అతీతమైన; శుద్ధ = పరిశుద్దమైన; సత్త్వ = సత్త్వ; గుణ = గుణములకు; ఆవాసంబున్ = నివాయస్థానమును; అకాల = కాలాతీతమైన; విక్రమంబునున్ = ప్రభావము కలదియు; సర్వ = సమస్త; లోక = లోకముల కంటె; ఉన్నతంబునున్ = ఉన్నతమైనదియును; సకల = సమస్త; సుర = దేవతలచే; గుణ = తన గుణములను; స్తుత్యంబునున్ = స్తోత్రము చేయబడు నదియును; లోభ = లోభము; మోహ = మోహము; భయ = భయములును; విరహితంబునున్ = లేనిది యును; అపునరావృత్తి = తిరిగిరాని; మార్గంబునున్ = దారి కలదియును; అనంత = అనంతమైన; తేజస్ = తేజస్సుతో; విరాజితంబునున్ = ప్రకాశించు నదియును; ఐన = అయినట్టి; వైకుంఠ = వైకుంఠ; పురంబున్ = పురమును; పొడగని = చూసి; అందు = అందులో.
భావము:
ఆ సమయంలో నీటిలో నుండి ఒక శబ్దం వినిపించింది. క మొదలు మ వరకూ ఉండే స్పర్శాక్షరాలలో పదువారవదీ ఇరవై యొకటవదీ అయిన “తప” అనే రెండు అక్షరాలవల్ల ఆ శబ్దం ఏర్పడింది. “తప” అనే ఆ పదం మహర్షులకు అమూల్యమైన ధనం. ఆ మాట రెండుసార్లు “తప తప” అని ఉచ్చిరింపబడింది. బ్రహ్మ దాన్ని విన్నాడు. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన పురుషుణ్ణి చూడాలనుకొన్నాడు. నాలుగు దిక్కులకు వెళ్లి వెతికాడు. ఎక్కడా ఆ పురుషుడు గోచరించలేదు. తిరిగివచ్చి తన నివాసమైన పద్మంలోనే కూర్చున్నాడు. కొంత సేపు ఆలోచించాడు. తన్ను తపస్సు చేయమని హెచ్చరించటానికే ఆ శబ్దం వినిపించింది అనుకొన్నాడు. ప్రాణాయమం ప్రారంభించాడు. తన్ను తపస్సు చేయమని హేచ్చరించటానికే ఆ శబ్దం వినపించింది అనుకొన్నాడు. ప్రాణాయామం ప్రారంభించాడు. జ్ఞానేంద్రియాలనూ, కర్మేంద్రియాలనూ స్వాధీనం చేసుకొన్నాడు. మనస్సును ఏకాగ్రం చేసుకొని వెయ్యి దివ్య సంవత్సరాలు అలా తపస్సు చేశాడు. ఆ దారుణ తపస్సుకు లోకాలన్ని తపించిపోయాయి. అప్పుడు శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే బ్రహ్మ వైకుంఠపురాన్ని దర్శించాడు. ఆ పురం రాజసగుణానికి, తామసగుణానికి ఆ గుణాలతో మిశ్రమైన సత్త్వగుణానికి అతీత మయినది. కేవల సత్త్వగుణానికి నివాస మయింది. కాలానికి అక్కడ ప్రాబల్యం లేదు. ఆది అన్ని లోకాలకంటే అత్యున్నత మైనది. సమస్త దేవతలకు ప్రస్తుతింప దగినది. అక్కడ లోభం, మోహం, భయం అనేవి లేవు. అక్కడికి పోయినవారు మళ్లీ తిరిగి రావడమంటూ జరగదు. తుది లేని తేజస్సుతో అది ప్రకాశిస్తు వున్నది. అలాంటి వైకుంఠపురాన్ని సరోజ సంభవుడు సందర్శించాడు.
No comments:
Post a Comment