|
హైదరాబాద్, మే 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన ‘స్మార్ట్ విలేజ్- స్మార్ట్ వార్డు’ కార్యక్రమానికి అమెరికాలో అపూర్వ స్పందన లభించింది. చంద్రబాబు పిలుపు మేరకు ఎన్నారైలు 2417 గ్రామాలను దత్తత తీసుకుని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకువచ్చారని టీడీపీ యువనేత నారా లోకేశ్ తెలిపారు. 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని లోకేశ్ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. తన పర్యటన పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన లోకేశ్.. అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులందరికీ మాతృ దేశంపై అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, ‘బ్రింగ్ బాబు బ్యాక్’ ఉద్యమంలో కూడా వీరు టీడీపీకి ఎంతో సహకరించారని తెలిపారు. లోకేశ్ పర్యటనలో శాన్‌ఫ్రాన్సి్‌సకో, పోర్ట్‌ల్యాండ్, న్యూజెర్సి, డల్లాస్, వాషింగ్టన్‌డీసీ, టెక్సాస్ వంటి ప్రముఖ నగరాల్లోని పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంలో పాలుపంచుకోవాలని అమెరికా వాణిజ్య విభాగం సహాయ కార్యదర్శి అరుణ్‌కుమార్‌తో లోకేశ్ విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ను తయారీరంగం హబ్‌గా తీర్చిదిద్దడంలో సహకరించమన్న లోకేశ్ అభ్యర్థనకు అరుణ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీకి చేస్తున్న కృషిని టెక్సాస్ యూనివర్సిటీ చాన్సలర్ విలియం హెచ్ మెక్‌రావెన్‌కు లోకేశ్ వివరించారు. దీనిపై మెక్‌రావెన్ ఆసక్తి చూపి సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఒక ప్రతినిధి బృందాన్ని ఆంధ్రప్రదేశ్‌కు పంపుతామని హామీ ఇచ్చారు. విశాఖలో డెవల్‌పమెంట్ సెంటర్ నెలకొల్పేందుకు యార్లగడ్డ కృష్ణ (ఇమాజినేషన్ ప్రెసిడెంట్) ముందుకు వచ్చారని తెలిపారు. విశాఖలో అడోబ్ స్కిల్ డెవల్‌పమెంట్ సెంటర్ స్థాపించేందుకు అడోబ్ సీఈవో సెంతన్ నారాయణ్ ఆసక్తి చూపారన్నారు. బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న కృషికి తోడ్పాటు ఇవ్వాలని ట్విట్టర్ జనరల్ కౌన్సిలర్ విజయ గద్దెను కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఏపీలో స్మార్ట్ సిటీల అభివృద్ధికి, వైఫై జోన్ల ఏర్పాటుకు సహకరిస్తామని అరుబానెట్ వర్క్స్ అధినేత కీర్తి మెల్కోటే హామీ ఇచ్చారని లోకేశ్ తెలిపారు. ఏపీలో 10 బిలియన్ల పెట్టుబడితో 10 వేల మెగావాట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు పెడతామన్న సాఫ్ట్‌బ్యాంక్ ప్రతినిధి బృందంతో లోకేశ్ భేటీ అయ్యారని టీడీపీ పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
|
No comments:
Post a Comment