‘నా పాట అమ్మకు అర్థం కావాలి...!’
'పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మా...కదిలే దేవత అమ్మా...కంటికి వెలుగమ్మా...మనలోని ప్రాణం అమ్మా...మనదైన రూపం అమ్మా...ఎనలేని జాలి గుణమే అమ్మా...నడిపించే దీపం అమ్మా, కరుణించే కోపం అమ్మా...వరమిచ్చే తీపి శాపం అమ్మా... అమ్మ ప్రేమను ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పగలరు. తన పాటలతో ప్రేక్షకుల హృదయాలను కదిలించే చంద్రబోస్ తప్ప. నేడు 'మాతృదినోత్సవం'. మరో ప్రత్యేకత ఈరోజే చంద్రబోస్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను 'జీవన' పలకరించింది. తన చిన్ననాటి కబుర్లు, అమ్మతో, పాటతో ఆయనకున్న అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు...
చంద్రబోస్ గారు మీకు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు...
చాలా సంతోషం. ధన్యవాదాలండీ.!
మీ జన్మదినం, జన్మనిచ్చిన తల్లిని గుర్తుచేసుకునే మాతృదినోత్సవం ఒకటే రోజు వచ్చాయి. మీరు ఎలా ఫీలవుతున్నారు?
నేను జన్మించిన రోజే మాతృదినోత్సవం కావడంతో ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ నేను బిడ్డనే అనే భావన కలుగుతుంది. ఇది నా 42వ పుట్టిన రోజు.
మీ చిన్నతనంలో అమ్మతో కలిసి పుట్టినరోజులు జరుపుకునేవారా?
పుట్టినరోజులు జరుపుకోవడం అనేది ఈ మధ్య కాలంలో వచ్చిన సంస్కృతి. నా చిన్నతనంలో అసలు పుట్టినరోజులు జరుపుకునేవారం కాదు. పండుగలకు, స్కూల్ ప్రారంభించినపుడు మాత్రమే కొత్త బట్టలు కుట్టించేవారు. కేకులు కట్ చేయడం, దీపాలు ఆర్పడంలాంటివేవీ తెలియదు. అప్పట్లో మాతృదినోత్సవం, ప్రేమికుల దినోత్సవం ఎక్కడ ఉన్నాయి. గాంధీ, చాచా నెహ్రూల పుట్టినరోజులు మాత్రమే జరుపుకునేవారం. పెళ్ళి తర్వాత సర్టిఫికెట్‌లో తేదీ చూసి మా ఆవిడ సుచిత్ర నా పుట్టినరోజు గుర్తుపెట్టుకొని జరుపుతుంది. అభిమానులు శుభాకాంక్షలు చెబుతుంటారు.
మీ అమ్మా, నాన్న గురించి చెప్పండి?
అమ్మ పేరు మధునమ్మ 70 సంవత్సరాలు. తనేమీ చదువుకోలేదు. నోటి లెక్కలు మాత్రం బాగా చెబుతుంది. ఒక పుస్తకంలో చదివాను 'అమ్మ రుణం తీర్చలేనిది. అమ్మకు అమ్మైతే తప్ప' అని. తను మనకు నిస్వార్థంగా చేసిన సేవ అమ్మకు చేయాలంటే ఆవిడ మళ్ళీ మనకు పుడితేనే. ఇక మా నాన్న స్కూల్ టీచర్. పేరు నర్సయ్య. దేశభక్తి ఎక్కువ. అందుకే నాకు 'సుభాస్ చంద్రబోస్' అని పేరుపెట్టుకున్నారు.
మీ ఊరి గురించి చెప్పండి?
మాది వరంగల్ జిల్లాలోని చల్లగరిగా. ఊరికి వెళితే ముందు గుర్తుకొచ్చేది. శివాలయం, గ్రంథాలయం, విద్యాలయం. గుడిలో పాటలు వింటూనే నేను పాటలు నేర్చుకున్నా. విద్యాలయంలో చదువు నేర్చుకున్నా. గ్రంథాలయంలో ఎన్నో రకాల పుస్తకాలు చదివేవాడిని.
ఇప్పుడు మీరు ఊరికి వెళితే అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది?
పెద్దపండుగ వాతావరణమే ఉంటుంది. ఊర్లోవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు. అక్కడ ఎన్నిరోజులు ఉంటే అన్ని రోజులు బిజీనే. కలవడానికి వచ్చిన వాళ్ళతో కబుర్లు చెబుతూ ఉంటాను.
ఎలాంటి పుస్తకాలు చదివేవారు?
బాలమిత్ర, చందమామ, బొమ్మరిల్లు, బుజ్జాయి, ప్రజ్ఞ, యువజన, మాబడి, పాఠశాల, విజ్‌డమ్ ఇలా ఎన్నోరకాల పుస్తకాలు చదివేవాడిని. మా గ్రంథాలయానికి కథలు, కవితలు, నవలలతోపాటు, సోవియట్ రష్యా పుస్తకాలు వచ్చేవి. అవి కూడా చదివేవాడిని.
ఈ అధ్యయనమే మీరు పాటల రచయితగా రాణించడానికి ఉపయోగపడినట్లుంది?
కచ్ఛితంగా. ఏదైనా సాధించాలంటే ఒక రాత్రిలో జరిగిపోదు. దాని వెనుక ఎన్నో సంవత్సరాల కఠోరశ్రమ ఉంటేనే విజయం సాధ్యం. ఇరవైయ్యేళ్ళ నా సాహిత్య జీవితంలో ఇప్పటికి రెండు వేలకు పైగా పాటలు రాశాను. దీనికి చిన్నతనం నుండి చదివిన పుస్తకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.
ఇప్పుడు ఎలాంటి పత్రికలు చదువుతుంటారు?
మిసిమి, తెలుగువెలుగు, బాలభారతం, రచన, జయంతి వారి పాత సంచికలు, విశాలాక్షి క్రమం తప్పకుండా చదువుతాను.
సినిమాను ఎలా ఎంజాయ్ చేసేవారు?
సినిమాకు వెళ్ళినపుడు అమ్మ నన్ను ఎత్తుకునేది. లోపలకు వెళ్ళేటపుడు 'ఈ పిల్లగాడికి టిక్కెట్ ఏది?' అని అడిగితే, 'వీడికి టిక్కెట్ ఏంటీ ఇంకా చిన్నపిల్లోడే!' అని చెప్పేది.
నేనేమో పడుకున్నట్లు నటించేవాడిని. అప్పుడు నాకు పదకొండేళ్ళు. ఇక లోపలకు వెళ్ళాక భుజం మీద నుండి చెంగున కిందకు దిగి, ఇక హాల్లో సినిమాను నాకంటే ఎంజారు చేసేవాళ్ళు ఉండే వాళ్ళు కాదు.
చిన్నప్పటి నుండి పాటలు బాగా వినేవారా?
నా పదోతరగతి పూర్తయ్యే వరకూ మా ఇంట్లో రేడియో కూడా లేదు. సినిమా హాలుపై మైకు పెట్టేవారు. ఆ పాటలు, గుడి మైకులో వచ్చే పాటలు, సినిమాలోని పాటలు అన్నీ విని, పాడుకుంటూ ఉండేవాడిని. ఊర్లోకి అప్పుడప్పుడు సురభి నాటకాల వాళ్ళు వచ్చేవారు. వాళ్ళు 'రాధా అందించు నీ లేత పెదవీ...గోపీ నాలోని అందాలు నీవే...' అనే పాట వేసేవారు. ఆ పాట బాగా పాడేవాడిని. అలాగే ఉదయాన్నే రేడియోలో జనరంజని అనే పాటల కార్యక్రమం వచ్చేది. స్కూలుకు వెళ్ళేటపుడు ఇది వచ్చేది. ఒక ఇంటి దగ్గరకు వెళ్ళినపుడు పల్లవి వచ్చేది. తర్వాత మ్యూజిక్, తర్వాత చరణం. ఇలా స్కూలుకు వెళ్ళేటప్పటికి ఒక పాట పూర్తయ్యేది. ఒక్కసారి విన్నపాట, మళ్ళీ ఇంకోసారి వింటే మాత్రం అది అలా నా మైండ్‌లో ఫిక్స్ అయిపోయేది.
అంటే మీలో అంతటి ఏకాగ్రత ఉండేదన్నమాట?
ఇంట్లో పాటలు వినడానికి, నేర్చుకోవడానికి అవకాశాలు, సౌకర్యాలు లేవు. అందుకే నాకు ఇష్టమైన పాటలు బయట ఎక్కడ విన్నా వాటిని చాలా శ్రద్ధగా వినడం, నేర్చుకోవడం అలవాటైంది. మనిషి తనకు అందని వాటికి అర్రులు చాచినట్లు అందుబాటులోలేని సంగీతం ఎక్కడ విన్నా నాకు అపురూపంగా అనిపించేది.
ఇంట్లో ఎవరికైనా సంగీత జ్ఞానం ఉందా?
వాళ్ళకు అసలు పాడేవారు, రాసేవారు ఉంటారని తెలీదు. సినిమాలో హీరో ఎవరైతే వారే రాసుకుంటారు, పాడుకుంటారనుకునేవారు. అలాంటి వాతారణంలో పుట్టి పెరిగిన నేను పాటలు రాయడం అనే వృత్తిని ఎంచుకోవడం ఒక విధంగా సాహసమనే చెప్పాలి. అప్పట్లో టీచర్, డాక్టర్, ఇంజనీర్ చేసేవారే గొప్పవాళ్ళు. వీటిని దాటి, వేరే ఏమీ ఆలోచించేవారు కాదు. మా కుటుంబం నుండి ఈ రంగంలోకి వచ్చిన మొదటివాడిని నేనే.
మీరు ఈ వృత్తిలోకి రాకముందు అమ్మతో ఏమైనా చెప్పారా?
నేను ఇంజనీరింగ్ చదువుతాను. మంచి ఉద్యోగం సంపాదిస్తానని నాపై అమ్మకు నమ్మకం. అందుకే పాటలవైపు వెళుతున్నానని ఇంట్లో ముందు చెప్పలేదు.1995లో 'తాజ్‌మహల్' సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. ఒక సంవత్సరం ప్రయత్నం చేద్దామనుకున్నా. ఎందుకంటే ముందే ఇంట్లోవాళ్ళతో చెబితే పాటలు రాయడం ఏంటని ఆశ్చర్యపోతారు. భయపడతారు. వద్దంటారు. అందుకే చెప్పలేదు.
మరి ఇంట్లో ఎలా తెలిసింది?
1996లో మొట్టమొదటిసారి నా గురించి 'సితార'లో ఇంటర్వ్యూ వచ్చింది. అది తెలిసినవారి ద్వారా నాన్నకు చేరింది. అలా ఆయనకు నేను పాటలు రాస్తున్నాననే విషయం తెలిసింది. అప్పటికే నేను ఇందులో ఒక స్థాయికి వచ్చాను. దాంతో ఇంట్లో ఏమీ అనలేదు. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. నన్ను అందరూ పొగుడుతుంటే లోపల సంతోషిస్తూనే, కొన్ని జాగ్రత్తలు చెప్పేవారు.
రాసేటపుడు మీరు తీసుకునే జాగ్రత్తలు?
ఒక పాట రాయడానికి అవకాశం వచ్చినపుడు దానికి సంబంధించి గతంలో ఏమైనా పాటలు వచ్చాయా అనేది చూస్తాను. వాటికి భిన్నంగా రాయడానికి ప్రయత్నిస్తాను. ఎప్పుడూ నా పాట ప్రజలతో ముడిపడి ఉండాలని కోరుకుంటాను. సరళమైన భాషను ఎంచుకుంటాను. నేరుగా నా పాట ప్రజలతో సంభాషించాలి. చదువుకోని వారికి కూడా నా పాట అర్థం కావాలి. ముఖ్యంగా నా పాట మా అమ్మకు అర్థంకావాలి.
మీరు రాసిన పాటల్లో అమ్మకు ఇష్టమైన పాట?
'స్టూడెంట్ నెంబర్ వన్' సినిమాలోని 'ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము' పాటంటే అమ్మకు చాలా ఇష్టం.
మీ పాటల రచనలపై అమ్మ ప్రభావం ఎంత వరకు ఉంది?
చాలానే ఉందని చెప్పాలి. చిన్నప్పుడు ఒగ్గు కథలు, చిందు భాగవతాలకు అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళేది. అలాగే సినిమా టాకీస్‌కు తీసుకెళ్ళేది. నేల టిక్కెట్‌కు వెళ్ళేవాళ్ళం. సినిమాలోని పాటలు, మాటలు అన్నీ గుర్తుపెట్టుకునేవాడిని. ఇక తర్వాత రోజు సినిమాలో డైలాగులన్నీ చెప్తుండేవాడిని. భుజానికి తువాలు కట్టుకొని కాంతారావులాగా కత్తి యుద్ధాలు చేసేవాడిని. ఇలా అమ్మతో పాటు సినిమాలకు, చిందు భాగవతాలకు వెళ్ళడంతో పాటలు పాడటం అలవాటైంది.
చిన్నపుడు అల్లరి పనులేమైనా చేశారా?
నాన్న అనారోగ్యంతో బడికి సరిగా వెళ్ళేవారు కాదు. దాంతో సగం జీతం మాత్రమే వచ్చేది. నాకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. నేను చిన్నవాడిని. నాన్నకు వచ్చిన జీతం చాలదు. అందుకే అమ్మ కూలి పనులకు వెళ్ళేది. అమ్మతో పనులకెళ్ళే ఇంటిపక్క వాళ్ళను 'పెద్దమ్మ, చిన్నమ్మ, అత్త' అని వరసలు పెట్టి పిలిచేవాళ్ళం. ఊర్లోకి కొత్తసినిమా వస్తే చాలు. ఇంటిపక్క వాళ్ళ దగ్గరకు వెళ్ళి 'మా అమ్మ సినిమాకు వస్తుంది, మీరు కూడా వస్తారా?' అని అడిగేవాడిని. వాళ్లు కూడా రోజు మొత్తం కష్టపడ్డాం కదా అని సాయంత్రానికి అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పటివరకు అమ్మకు అసలు సినిమాకు వెళ్ళే విషయమే తెలీదు. వాళ్ళు వచ్చినపుడు 'నేనెప్పుడు సినిమాకెళదామని చెప్పా?' అని అడిగేది. వాళ్ళేమో సుభాష్ చెప్పాడనేవారు. అందరూ రెడీ అయి వచ్చారు కాబట్టి, సినిమాకు వెళ్ళక తప్పేది కాదు. అలా నేను కూడా వాళ్ళతో సినిమాకు వెళ్ళేవాడిని.
- సలీమ
(ప్రజాశక్తి దినపత్రిక నుండి)






No comments:
Post a Comment