వేదవిద్యార్థులు - వేదపాఠం
ఒకసారి ఒక ఋగ్వేద పండితుడు తన ఐదుగురు శిష్యులతో కలిసి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామి వారి ముందు వాళ్ళు నేర్చుకున్న పాఠాలలో నుండి కొద్దిగా చెప్పమన్నాడు. వాళ్ళు వేదం వల్లిస్తున్నారు. స్వరం రాగయుక్తంగా లేదు. అంతేకాకుండా వారు చెప్తున్న విధానం వల్ల ఆ పిల్లలకి సంస్కృత జ్ఞానం బొత్తిగా లేదు అని తెలుస్తోంది. ఆ ఉపాధ్యాయుడు “వీళ్ళకు వేదం నేర్పడం చాలా కష్టం. వీళ్ళని ఇంగ్లీషు చదువు చదువుకోవడానికి పంపాలి” అని అన్నాడు.
మహాస్వామివారు ఆ పండితుణ్ణి కూర్చోమని చెప్పారు.
”గణపతిగారూ, ప్రపంచంలో ప్రతీది చాలా కష్టమే. వడడం చాలా కష్టం. పొయ్యి వెలిగించాలి, నీళ్ళు మరగబెట్టాలి, అన్నం అయిన తరువాత గంజి వార్చాలి, కూరగాయలను కొసి ఉడికించాలి. . .
బట్టలుతకడం ఇంకా కష్టం. బట్టల్ని ఉతికాలి, జాడించాలి, నీరు పోయేలాగా వాటిని పిండాలి, తరువాత వాటిని తీగపై వేసి ఆరబెట్టాలి. . .
ప్రతీది కష్టమే. మీరు వరగూరులో జరిగే ఉరియడి సంబరం గురించి విని ఉంటారు. ఎవరైనా ఒక పెద్ద స్థంబాన్ని ఎక్కి పైన ఉన్న కానుకని అందుకోవాలి. ఆ స్తంభానికి జారుడుదనం కోసం కలబంద గుజ్జు ఆముద నూనె బాగా రాస్తారు. అసలు దాన్ని ఎక్కడానికే కుదరదు. ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే వారిపై పెద్దగా నీళ్ళు చల్లుతారు. చాలా కష్టం. కాని ఎందరో దాన్ని ఎక్కడానికి ప్రయత్నించి ఎవరో ఒక్కడు ఎక్కి ఆ బహుమానాన్ని అందుకుంటాడు. .
కొద్దిగా కృషిచేస్తే ఈ పిల్లలు కూడా వేదం చక్కగా నేర్చుకుంటారు. వేదము ఈశ్వరప్రోక్తము, మహాజ్ఞానము. ఈ కాలంలో వేదం నేర్చుకోవడానికి రావడమే గొప్ప. మరి అలా వచ్చిన వారిని మనం పంపించివేస్తే ఎలా?” అని అన్నారు
పరమాచార్య స్వామివారి మాటలు ఆ రుగ్వేద పండితుడిపై ప్రభావం చూపాయి. తనకు కలిగే కష్టాన్ని లెక్కచేయక చాలా శ్రద్ధతో వారికి వేదం నేర్పించసాగాడు.
ఐదేళ్ళు గడిచిపోయాయి.
ఐదేళ్ళు గడిచిపోయాయి.
ఆ ఐదుగురు విద్యార్థులూ, వేద రక్షణ నిధి ట్రస్ట్ వారు నిర్వహించే పరీక్షకు హాజరయ్యారు. ఋగ్వేదంలో అందరూ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మంచి బహుమానం అందుకున్నారు. వారి ఉపాధ్యాయుని కష్టం వృధా పోనివ్వలేదు ఆ విద్యార్థులు.
మహాస్వామివారి మాటలు అబద్దం అవుతాయా?
--- ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ అనుభవాల సంగ్రహం
No comments:
Post a Comment