డెడ్ లైన్!
14-06-2016 01:39:09
- సర్కారుకు రెండు రోజులే గడువు.. ఆలోగా సమస్యను పరిష్కరించాలి
- లేదంటే భవిష్యత కార్యాచరణపై నిర్ణయం.. కాపు నేతల అత్యవసర సమావేశం
- దాసరి, చిరంజీవి, పల్లంరాజు, బొత్స తదితరుల హాజరు.. 7 తీర్మానాలకు ఆమోదం
- ముద్రగడ ఒంటరివాడు కాదని వెల్లడి.. జేఏసీతో తక్షణం చర్చలు జరపాలని డిమాండ్
- ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు.. అరెస్టుల తీరు అమానవీయం: చిరంజీవి
- వంగవీటి రంగాను పోగొట్టుకున్నాం.. ఈయన్నూ పోగొట్టుకోలేం: దాసరి
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): ‘కాపులు ఒంటరివాళ్లు కాదు.. ముద్రగడ పద్మనాభం ఒంటరి కాదు .. కాపు సమాజం ఒంటరిది కాదు. ఇలాంటి ఉద్యమం కారణంగానే మా నాయకుడు వంగవీటి మోహనరంగాను పోగొట్టుకున్నాం. ముద్రగడనూ కోల్పోయేందుకు సిద్ధంగా లేం’ అని కాపు నేతలు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రులు దాసరి నారాయణరావు, ఎం.ఎం.పల్లంరాజు, కె.చిరంజీవి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య, వైసీపీ సీనియర్ నేతలు
బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఏపీసీసీ మాజీ అద్యక్షుడు సూర్యారావు తదితరులు సమావేశమయ్యారు. భవిష్యత కార్యాచరణపై చర్చించారు. కాపు సామాజిక వర్గం ఒంటరి కాదని ప్రభుత్వానికి తెలియజెప్పాలని నిర్ణయించారు. ముద్రగడ ఉద్యమం, ఇటీవల కాపు నేతల అరెస్టులు, వీటిని నిరసిస్తూ దీక్ష చేపట్టిన ముద్రగడతో సహా కుటుంబ సభ్యుల అరెస్టులు, ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందినవారి అరెస్టు వంటి ఘటనలు కాపులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఈ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రోజు ముద్రగడపై అప్రజాస్వామికంగా జరిగిన దాడిని విడిచిపెడితే.. కాపు సమాజంలో మిగిలినవారిపైనా ఇదే రకమైన దాడి పునరావృతమవుతుందని భావించింది. సమావేశంలో ఏడు తీర్మానాలను ఆమోదించారు. అవి.. 1. ముద్రగడ దీక్షకు సంపూర్ణ మద్దతును ప్రకటించడమే కాకుండా ఆయన వెంట అండగా నిలబడాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2. ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. 3. ముద్రగడ ఇంటి తలుపులు పగులగొట్టి నిర్బంధించిన విధానాన్ని, మహిళలని కూడా చూడకుండా భార్యా, కోడళ్ల పట్ల కూడా నేరస్తుల కంటే హీనంగా పోలీసులు ప్రవర్తించిన తీరును ఏకకంఠంతో ఖండించింది. ముద్రగడ తనయుడిని పోలీసులు పాశవికంగా కొట్టి, లాఠీలతో తరిమి తరిమికొట్టి వేధించిన విషయాన్ని, ఆ సమయంలో మీడియాను బలవంతంగా బయటకు నెట్టి కొందరి వద్ద లభ్యమైన క్లిప్పింగులను బలవంతంగా లాక్కున్న విధానాన్ని అప్రజాస్వామిక, ఆటవిక చర్యగా పరిగణించి ఈ సమావేశం ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తున్న ఉద్రిక్తతలను తొలగించే విధంగా తక్షణమే ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు ఆయన కోరిన విధంగా జేఏసీ ద్వారా చర్చలు జరపాలి. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత కార్యాచరణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవహారంపై మళ్లీ సమావేశం నిర్వహిస్తాం. 4. ఏ కాపు సోదరుడు గానీ, సోదరి గానీ ఇంటి నుంచి బయటకు వస్తే ఇంటికి తిరిగి వెళ్లని ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టించి.. 144 సెక్షన్ మాత్రమే అమల్లో ఉందని కోర్టుకు తెలియజేయడం తీవ్ర ఆక్షేపణీయం. 5. కోనసీమలో మహిళలపై లాఠీచార్జి, అనధికారికంగా రోజూ వందలాది మంది కాపు యువకులు, నాయకులను పోలీసు స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం. 6. నిరంకుశత్వంగా మీడియాపై ఆంక్షలు విధించి, చానళ్ల ప్రసారాలను నిలిపివేయడం, బాహ్యప్రపంచానికి విషయాలు తెలియకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. 7. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో ప్రభుత్వం ఎదురుదాడి చేయించడం అప్రజాస్వామికం, అనాగరికం. వారిపై ఒత్తిడి చేసి విభజించి పాలించాలనే ఈ ఎత్తుగడను ఖండిస్తున్నాం. ఆయా నాయకులు దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నాం.
ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు: చిరు
దీక్ష చేస్తున్న ముద్రగడకు ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని చిరంజీవి హెచ్చరించారు. కాపు నేతల అత్యవసర భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వానికి రెండు రోజుల గడువిస్తున్నామని, ఆలోగా సమస్యను పరిష్కరించకుంటే.. భవిష్యత కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. ముద్రగడ ఆరోగ్యం ఏమవుతుందోనన్న ఆందోళన తమలో ఉందని, అందుకే తామంతా ఆయనకు సంఘీభావం తెలిపేందుకు బయటకు వచ్చామని చెప్పారు. కాగా.. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చిందని, అప్పుడే ఈ అంశాన్ని నెరవేర్చి ఉంటే.. ఈరోజు ఆందోళనలకు ఆస్కారం ఉండేది కాదు కదా అని విలేకరులు ప్రశ్నించగా.. చిరంజీవి స్పందించేలోగా.. వైసీపీ సీనియర్ నేత బొత్స కల్పించుకున్నారు. ఇది భావోద్వేగాల సమయమని, రాజకీయాల గురించి మాట్లాడేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. రాజకీయాల కోసం మాట్లాడదలిస్తే.. చంద్రబాబు గురించి మాట్లాడేవారిమని చెప్పారు.
భారత్ లో ఉన్నామా.. పాక్‌లో ఉన్నామా: దాసరి
‘ఒకప్పుడు వంగవీటి మోహనరంగాను పోగొట్టుకున్నాం. ఇప్పుడు ముద్రగడను పోగొట్టుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతోనే తామంతా సమావేశమయ్యామని దాసరి విలేకరులతో అన్నారు. ‘ఇది సామాజిక సమస్య. కానీ దీనిని టెర్రరిజంగా ప్రభుత్వం చిత్రీకరించడం హేయం. ఈ విషయాలను కవర్ చేస్తున్న మీడియాను కట్ చేస్తున్నారు. కాపు సోదరీ సోదరులను అరెస్టు చేస్తున్నారు. ఫోన్లు పనిచేయకుండా జామర్లు పెడుతున్నారు. ముద్రగడను కూడా పత్రికల వారితో మాట్లాడించకపోవడం అప్రజాస్వామికం. ఇదంతా చూస్తుంటే.. అసలు మనం ఏపీలో ఉన్నామా? భారతలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఆందోళన కలుగుతుంది. జేఏసీ నాయకులతో చర్చించేందుకు ముద్రగడ సిద్ధమయ్యారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం జేఏసీతో చర్చలు జరపాలి. ఈ అంశంపై మాట్లాడే కాపు నేతలపై అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులతో బురద జల్లించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బురద జల్లే కార్యక్రమం చేపడితే.. మా దగ్గర ఇంకా పెద్ద బురద ఉంది జాగ్రత్త’ అని హెచ్చరించారు.
No comments:
Post a Comment