మనదేశంలో ఇప్పుడున్న కులవ్యవస్థ ప్రారంభంలో వర్ణవ్యవస్థగా ఉండేది. ఈ వ్యవస్థ సమాజాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలుగా విభజించింది. ఆనాటి పాలకవర్గ మేధావులు వర్గదోపిడీని వ్యవస్థీకృతం చేసేందుకు వర్ణ వ్యవస్థను సృష్టించారు. భగవంతునిచే ఈ విభజన చేయబడిందని ప్రచారం చేసి, ప్రజలను నమ్మించారు. బ్రహ్మదేవుని ముఖంలో నుంచి బ్రాహ్మణులు, బాహువుల్లో నుంచి క్షత్రియులు, తొడల్లోంచి వైశ్యులు, పాదాల్లోంచి శూద్రులు పుట్టుకొచ్చారని ప్రచారం చేశారు.
ఈ విషయాన్ని రుగ్వేదం పదవ మండలంలోని పురుషసూక్తం 12వ రుక్కులో పొందుపరిచారు. బ్రాహ్మణులుగా తమను తాము ప్రకటించుకున్న స్వార్థ మేధావుల కుట్ర ఇది. బ్రాహ్మణులు తెలివితేటలు గలవారుగా పుట్టించబడ్డారు. అందుచేత వీరు సమాజంలోని ఇతరులందరికీ మంచీ-చెడులు బోధించాలి. బ్రహ్మముఖం లోనుంచి రావడమే వీరి తెలివితేటలకు కారణం. క్షత్రియులు బ్రహ్మ బాహువుల్లో నుంచి వచ్చారు. అందుచేత వీరికి భుజబలం ఎక్కువగా ఉంటుంది. యుద్ధాలు, రాజ్య సంరక్షణా బాధ్యతలు వీరు చూస్తారు. అందుచేత వీరు రాజ్యాన్ని పాలించాలి. వైశ్యులు తొడల్లోంచి వచ్చిన కారణంగా వ్యవసాయం, పశుపోషణలు వంటి శారీరక శ్రమలు చేయాలి. అందరికంటే హీనులుగా జన్మించినవారు శూద్రులు. అందుచేత వీరు ఇతర వర్ణాల వారికి సేవలు చేయాలి. ఈ విభజన దైవసృష్టి. కాబట్టి దీనిని అందరూ పాటించాలి. ఇది సామాజిక ధర్మం. అన్ని సమాజాలకూ ఈ వర్ణవ్యవస్థ ఆదర్శనీయం. వర్ణధర్మం అతిక్రమించబడితే సమాజం భ్రష్టుపట్టిపోతుందని వర్ణవ్యవస్థ నిర్మాతలు ప్రచారం చేశారు.
సమాజ పరిణామ క్రమంలో భాగంగా జనాభా పెరగటం, అనేక కొత్తవృత్తులు తలెత్తటంతో ఈ వర్ణవ్యవస్థలో స్వల్ప మార్పులు ప్రవేశపెట్టారు. వైశ్యులకు వ్యాపారాలను, శూద్రులకు ఉత్పత్తి శ్రమలను అప్పగించి, వారి స్థానాన్ని స్వల్పంగా పెంచారు. పంచములు అనే వర్ణం కొత్తగా ప్రవేశపెట్టబడింది. అంతకుముందు శూద్రులకిచ్చిన హీనస్థానాన్ని పంచములకిచ్చారు.
No comments:
Post a Comment