మీ జీవిత లక్ష్య ఏమిటి? అని ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు. ఇంజినీర్ అనో, ఐపీఎప్ అనో, ఐఏఎస్ అనో అంటారు. జీవితంలో ఏదో ఒక డిగ్రీ సాధించడమే మనకు మహాగొప్ప విషయం. మహా అయితే మరో రెండు మూడు డిగ్రీలు సాధించిన వాళ్లూ ఉన్నారు. కానీ 42 విశ్వవిద్యాలయాల నుంచి వేర్వేరు సబ్జెక్టుల్లో 20 డిగ్రీలు పొందిన వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏంటి ఒక వ్యక్తి 20 డిగ్రీలు సాధించడమా? అదెలా సాధ్యం అంటారా? కానీ ఇది నిజం. ఆయన గురించి తెలుసుకుంటే… ఔరా అనకమానరు.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాంత్ జిక్కార్.. అసమాన ప్రతిభావంతుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక వ్యక్తి ఐఎఎస్, ఐపిఎస్, డాక్టర్, లాయర్, ఎంబీఏ, పిహెచ్ డి, యువ ఎమ్మెల్యే, పెయింటర్, ఫోటోగ్రాఫర్, యాక్టర్ గా తన జీవితకాలంలో కాగలరా. అయితే శ్రీకాంత్ జిక్కార్ ఇవన్నీ సాధించారు. భారతదేశంలో శ్రీకాంత్ కంటే మోస్ట్ క్వాలిఫైడ్ పొలిటీషియన్ లేడని నిర్దారణకు వచ్చిన లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ.. శ్రీకాంత్ జిక్కార్ పేరుని నమోదు చేశారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన శ్రీకాంత్ పుట్టింది సెప్టెంబర్ 14, 1954 లో నాగపూర్ సమీపంలోని అజన్ గాన్ లో.
శ్రీకాంత్ కి సైన్స్, పాలిటిక్స్, థియేటర్, స్పోర్ట్స్, జర్నలిజంపై ఆసక్తి ఎక్కువ. ఆయన విద్యా ప్రస్థానం వైద్యరంగంలో ఎంబిబిఎస్ తో ప్రారంభమైంది. అది సాధించాక ఎంఎస్ చేశారు. ఆ తర్వాత ఆ రంగం నుంచి బయటకి వచ్చిన శ్రీకాంత్ లా డిగ్రీ చేశారు. ఆపై ఎల్ఎల్ ఎం (ఇంటర్నేషనల్ లా) చేశారు. లా డిగ్రీ చేతికొచ్చాక ఆయన మనసు డీబీఎం , ఎంబీయే మీదకు మళ్లింది. దాన్ని కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం చేశారు. ఇలా 1973 నుంచి 1990 మధ్యకాలంలో 42 విశ్వవిద్యాలయాల పరీక్షలు వేసవి, శీతాకాలంలో రాశారు. అంతేకాకుండా 20 పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేశారు. అప్పటికి ఆయన వయసు జస్ట్ 24 ఏళ్ళే.
25 వ యేట అడుగుపెట్టేటప్పటికి శ్రీకాంత్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) పరీక్ష రాశారు. అది పూర్తయ్యాక రాజీనామా చేసి ఐఎఎస్ రాశారు. తర్వాత ఎంఎ ఎకనామిక్స్, ఇంగ్లీష్ లిటరేచర్, సంస్కృతం, భారతీయ చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ పూర్తి చేశారు. వీటితో పాటు ఫిలాసపీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, సైకాలజీ, డి లిట్ సంస్కృతం కూడా పూర్తి చేశారు.
అప్పటివరకూ శ్రీకాంత్ చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి 1980 లో మొదటిసారిగా సాధారణ ఎన్నికల్లో పోటీచేశారు. అదే సంవత్సరం మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అతి తక్కువ వయసు కలిగిన రాజకీయనేతగా 14 శాఖలపై పట్టు సాధించారు. అంతేకాదు శ్రీకాంత్ 1992-1998 మధ్యకాలంలో రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు.
ఇక శ్రీకాంత్ జిక్కార్ ఇల్లే ఓ పెద్ద గ్రంథాలయం. ఆయన ఇంట్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన 52 వేల పుస్తకాలున్నాయి. ఇవే కాదు విద్యారంగంతో పాటు ఆయనకు ఇతర కళలపైన ఆసక్తి, అభిరుచి ఉంది. శ్రీకాంత్ అద్భుత చిత్రకారుడు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కూడా. థియేటర్ ఆర్టిస్ట్, మంచి వక్త కూడా. ఆరోగ్యం, ఆర్ధికశాస్త్రం, మత సంబంధమైన అంశాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది.
బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీకాంత్ జిక్కార్ జూన్ 2, 2004 లో నాగ్ పూర్ సమీపంలోని 6వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. ఎన్నో డిగ్రీలు సాధించిన శ్రీకాంత్ పిన్నవయసులోనే 51 వ ఏటనే కన్నుమూశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీకాంత్ అకాల మరణం అందరిని బాధించింది.

No comments:
Post a Comment