News Feed
లేపనమద్ది, మళ్ళీ నింగికెగిరిద్దాం.
మత రాజకీయుల నిబిడాశ్చర్యాన్ని
మైమరచి చూద్దాం -మురుగన్నే కాదు
మనల్ని మనం కాపాడుకుందాం................మనమూ సంఘీభావం ప్రకటిద్దాం రండి నేస్తాలారా ......
>>>>>>>>>>>>>>>>>>>>>
క్షతాత్మగాత్రుడు - వి.ప్రతిమ
++++++++++++++++++++
ఆత్మతో పాటు
అతడి ప్రతి అక్షరమూ
క్షతగాత్రమై నెత్తురోడుతుంది.
మనమిప్పుడు రైతుల్నేకాదు
రచయితలనీ ఆత్మహత్యలవైపు నెట్టగలం.
మతోన్మాదపు మాయాశూలంలో
నలుపు తెలుపు కాగితాల్ని సైతం
కఫన్‌లుగా చుట్టగలం.
మొత్తంగా చరిత్రని తర్కంగానో
గతితర్కంగానో విశ్లేషించి
కలలన్నింటినీ ఒడిసిపట్టి
కధనో, కవితనో, నవలనో అల్లి
పాఠకుల హృదయాభరణంగా
మలచగల రసవిద్య తెలిసిన నేర్పరి
ఆత్మస్పర్శ వెచ్చదనాన్నందించి
తత్త్వం నేర్పి మనీషిగా మార్చగల తీర్పరి
రచయితంటే ఒక పూర్తి మనిషి...
ఒకానొక వినూత్న నిర్వచనం.
సతత హరిత సాహిత్య పరీమళం.
అవినీతి ప్రభుత్వాలకూ
అడ్డదారి సమాజాలకూ
అతడేకదా ప్రధాన ప్రతిపక్షం.
ఏళ్ళనాటి చరిత్రను తవ్వి తీసినందుకో
ఖురాన్ని సంస్కృతంలో రాసి
వేదాల్ని అరబ్బు చేసినందుకో
అస్థిత్వ వేదనలని ఆర్తిగా నిమిరినందుకో
ఆగ్రహించి, నమస్కరించాల్సిన
మునివేళ్ళని నిర్దాక్షిణ్యంగా నరికివేయగలం
మనం సంస్కృతీ పరిరక్షకులం
తనంతట తానుగా అతడు మరణించేదాకా
అతడినీ, అతడి రచనల్నీ మంటల్లోకి నెట్టేదాకా
అనాదులైన అతడి పునాదుల్ని పెకలించి
వేల ఏళ్ళుగా ఎగురుతోన్న విజయపతాకని
నేలకి దించి కాళ్ళతో తొక్కితొక్కి
రణశాంతి పొందేదాకా
మనకి నిద్రపట్టదు, మనసూ చల్లబడదు.
అతడి చెక్కిలిమీద జారే కన్నీటిచుక్కని
మౌనప్రేక్షకులమై ఆస్వాదించగల
మహానుభావులం... మనమూ మనుషులం
మిత్రులారా మీరెటువైపు?
మాట్లాడాల్సిన సమయంలో
మౌనం కూడ నేరమే...దేశ ద్రోహమే కదా.
రండి...రండి
దగ్ధమైపోతోన్న అక్షరాలని ఏరుకుని
లేపనమద్ది, మళ్ళీ నింగికెగిరిద్దాం.
మత రాజకీయుల నిబిడాశ్చర్యాన్ని
మైమరచి చూద్దాం -మురుగన్నే కాదు
మనల్ని మనం కాపాడుకుందాం.
(పెరుమాళ్ మురుగన్‌కి ప్రేమగా)
- వి.ప్రతిమ .98485 41485 ( Andhrajyothi.Mar.16.2015 )
No comments:
Post a Comment